క్యాంప్: వారణాసి (యు. పి)

కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు

• ఈ నెల 3 నుంచి 5 వరకు "కాశీలో కార్తీకం" పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమం
• హైందవ ధర్మాన్ని దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడం కోసమే ఈ కార్యక్రమం 
• దేశం నలుమూలల నుంచి కార్యక్రమంలో పాల్గొననున్న పీఠాధిపతులు, స్వామిజీలు, సంతులు..



కాశి: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు తలపెట్టిన కాశీలో కార్తీకం అనే కార్యక్రమాన్ని పురస్కరించుకుని పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహస్వామి వారు, ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ఈరోజు జ్యోతిర్లింగ పుణ్య క్షేత్రమైన కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ఆలయ ట్రస్ట్ సభ్యులు స్వామివారికి ప్రత్యేక స్వాగతం పలికారు. అనంతరం స్వామివారు స్వయంగా విశ్వేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు , స్వామి వారికి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రాల నడుమ అభిషేకం, పూజలు దిగ్విజయంగా జరిగాయి. స్వామి వారి వెంట వచ్చిన భక్తులు విశ్వేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. అదే సందర్భంగా కాశీలో గత నాలుగు రోజులుగా దర్శనమిస్తున్న బంగారు అన్నపూర్ణ అమ్మవారిని పీఠాధిపతులు దర్శించుకున్నారు. అనంతరం  శ్రీ విశాలక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ విశాఖ శ్రీ శారదాపీఠం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఉత్తర భారతదేశంలో ముక్తి క్షేత్రమైన వారణాసి క్షేత్రంలో "కాశీలో కార్తీకం" అనే కార్యక్రమాన్ని  నిర్వహించదలచినట్లు పీఠాధిపతులు తెలియజేసారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని, వచ్చిన భక్తులందరూ అధ్యాత్మికంగా సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని స్వామివారు పేర్కొన్నారు. అలాగే దేశం నలుమూలల నుంచి అనేక మంది పీఠాధిపతులు, సంతులు, మహాత్ములు, స్వామిజీలు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారని స్వామివారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భారతదేశం అంతా హైందవ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడానికి విశాఖ శ్రీ శారదాపీఠం కాశీలో ఈ కార్యక్రమం తలపెట్టిందని, దానికి విశ్వేశ్వరుడు, అన్నపూర్ణా దేవి, విశాలాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని స్వామివారు ప్రార్థన చేశారు. అనంతరం స్వామివారికి ఆలయ ట్రస్ట్ సభ్యులు బ్రిజ్ భూషణ్ ఓజా ఆలయ మర్యాదలతో ప్రత్యేక ప్రసాదాలు అందజేసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన విశాఖ శ్రీ శారదాపీఠం భక్తులు, పీఠాధిపతుల వారి సమక్షంలో విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ తారకాంధ్రాశ్రమము మేనేజింగ్ ట్రస్టీ శ్రీ వివి సుందర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
Comments