మౌళిక వసతులతో ఏయూ సుసంపన్నం
ఏయూ వీ సీ ఆచార్య ప్రసాదరెడ్డి.
అభివృద్ది కార్యక్రమాల ప్రత్యక్షంగా పరిశీలన..
నాలుగు సంవత్సరాల కాలంలో ఘనమైన వృద్దిని సాధించిన ఏయూ..
ప్రగతి కార్యక్రమాలను మీడియాకు వివరించిన వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి..
విశాఖపట్నం, అక్షరవిజన్ -: ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని మౌళిక వసతులతో సుసంపన్నం చేస్తున్నామని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గత మూడు సంవత్సరాల కాలంలో ఏయూలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను మంగళవారం ఉదయం మీడియా ప్రతినిధులు స్వయంగా చూపిస్తూ వివరించారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి ప్రారంభమైన మీడియా టూర్ సుమారు నాలుగు గంటలపాటు సాగింది. అనంతరం వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ గ్లోబల్ సిటిజన్గా యువతను తీర్చిదిద్దుతూ, భారత్ను విశ్వగురువుగా నిలపడానికి తమవంతు కృషిచేస్తున్నామన్నారు. నూతన విద్యావిధానాన్ని శతశాతం కార్యరూపంలో చూపుతూ విద్యను అందిస్తున్న విధానం వివరించారు. వర్సిటీలో క్రీడ, మౌళిక వసతులు, హాస్టల్స్ నిర్మాణం, స్టార్టప్,ఇంక్యుబేషన్ కేంద్రాలను అభివృద్ది చేయడం జరుగుతోందన్నారు. ఉపాధి అవకాశాలను సృష్టించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, ఆవిష్కర్తలను తీర్చిదిద్దే విధంగా ఆ హబ్ ఏర్పాటు చేసామన్నారు. ఐదు అంతస్థుల్లో 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఆ హబ్లో 92 స్టార్టప్ కంపెనీలు పనిచేస్తున్నాయన్నారు. సిరిపురం వద్ద నిర్మించి ఫార్మహబ్`ఎలిమెంట్ త్వరలో సేవలు ఆరంభిస్తుందన్నారు. దీనిలో నాలుగైదు ఫార్మ పరిశ్రమల భాగస్వామ్యం స్వీకరిస్తామన్నారు. బయలాజికల్ మోనిటరింగ్ అంశంపై పనిచేస్తామన్నారు. రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో ఫార్మ అనుసంధానంగా వందకుపైగా స్టార్టప్లు వచ్చే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో ఏయూకు అవసరమైన అతిపెద్ద ఆర్ధిక వనరుగా ఎలిమెంట్ నిలుస్తుందన్నారు. ఉత్తరాంధ్ర విద్యార్థులంతా వీటిని వినియోగించుకోవచ్చునన్నారు. ఎంఎల్ఆర్ విభాగంలో అవంతి ఫౌండేషన్తో దాదాపు రూ 12 కోట్ల వ్యయంతో వెట్ల్యాబ్, ఇతర మౌళిక వసతులు అభివృద్ది చేసామని వివరించారు. ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం వద్ద నూతనంగా నిర్మించిన డిజిటల్ జోన్లో 10 స్మార్ట్ క్లాస్రూమ్లు, సమావేశ మందిరాలు, 650 కంప్యూటర్లతో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించే సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఏర్పాటు చేసిన నాస్కామ్ సెంటర్ పనితీరు, ప్రగతి తెలియజేశారు. భవిష్యత్లో అత్యంత ప్రాచుర్యం పొందే డ్రోన్ టెక్నాలజీపై ప్రత్యేకంగా ఒక అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసామన్నారు. డ్రోన్ రూపకల్పన, వినియోగం, తయారీ వంటి అంశాలపై యువతకు ఈ కేంద్రం శిక్షణ అందిస్తుందని, ఏయూ హెలీపాడ్ గ్రౌండ్కి చేరువలో దీనిని ఏర్పాటు చేసామన్నారు. విశ్వవిద్యాలయం కళలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. దీనిలో భాగంగా దాతలు, వర్సిటీ నిధులతో కె.వి గోపాల స్వామి ఆడిటోరియంని పూర్వవైభవం తీసుకువస్తున్న విధానం వివరించారు. ఇంజనీరింగ్ కళాశాలలో అభివృద్ది చేసిన అంబేద్కర్ ఆడిటోరియం స్వయంగా మీడియా మిత్రులకు చూపించారు. వీటిని నగరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులకు ఉచితంగా అందిస్తామన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన హాస్టల్స్ నిర్మిస్తున్నామని శివాజిపాలెంలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాన్ని మీడియాకు చూపించారు. పక్కనే పూర్వవిద్యార్థుల సహకారంతో నిర్మించిన ఆలుమ్ని హాస్టల్ భవనం, రూసా నిధులతో నిర్మించిన మెటా`హెచ్ హాస్టల్, ఫార్మశీ విద్యార్థినులకోసం నిర్మించిన హాస్టల్, ఆధునీకరించిన సమత, మమత న్యాయ కళాశాల హాస్టల్స్, నాగార్జున వసతి గృహం, శాతవాహన హాస్టల్లను మీడియాకు చూపించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తున్న ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ పనితీరును మీడియా ప్రతినిధులకు వివరించారు. ఏయూలో నూతనంగా ముగ్గురు ప్లేస్మెంట్ అధికారులను నియమించి, ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నామన్నారు. త్వరలో సైన్స్, ఆర్ట్స్, న్యాయ, ఫార్మశీ, ఇంజనీరింగ్ కళాశాలల పరిధిలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో నియామక పత్రాలను అందించడం జరుగుతుందన్నారు. నాడు`నేడు స్ఫూర్తితో అనేక హాస్టల్ భవనాలను పూర్తిస్తాయిలో ఆధునీకరించడం జరిగిందని వివరించారు. మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎస్ఏ ఎల్పిజి హాస్టల్ భవనాన్ని సిఎస్ఆర్ నిధులతో నిర్మాణం చేయడం,ప్లేస్మెంట్స్ తదితర అంశాలను వివరించారు. త్వరలో ఏయూ విద్యార్థులను భాగస్వాములను చేస్తూ పెద్దెత్తున మెక్కలు నాటి, సంరక్షించి, వృక్షాలుగా పెంచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఏయూలో అభివృద్దిచేసిన నూతన మైదానాలు, వసతులను తెలియజేశారు. సమాజంలో వివిధ రంగాల నిపుణులను ప్రొఫెసర్ ఆన్ ప్రాక్టీస్గా ఏయూలో స్వీకరిస్తామన్నారు. ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం బలోపేతం చేయడానికి చేపడుతున్న చర్యలను వివరించారు. ఫుడ్ టెక్నాలజీ ల్యాబ్ల ఏర్పాటు చేస్తున్న విధానం వివరించారు. ఏప్రియల్ 26నుంచి ఏయూ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను రెండు వారాలు విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం సాధిస్తున్న ప్రగతిని సమాజానికి తెలియజేసే విధంగా మీడియా కృషిచేయాలని వీసీ ప్రసాద రెడ్డి కోరారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ వి.కృష్ణ మోహన్, మీడియా రిలేషన్స్ డైరెక్టర్ ఆచార్య చల్లా రామకృష్ణ, ప్రిన్సిపాల్స్ ఆచార్య జి.శశిభూషణ రావు, ఆచార్య వై.రాజేంద్ర ప్రసాద్, ఆచార్య టి.శోభశ్రీ, ఆచార్య కె.విశ్వేస్వర రావు, ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్, ఆచార్య ఏ.కె.ఎం పవార్, ఆచార్య టి.షారోన్ రాజు, ఆచార్య కె.వెంకట రావు, ఆచార్య ఎన్.ఏ.డి పాల్ తదితరులు పాల్గొన్నారు.
బ్యూరో చీఫ్ -: డీ ఎస్ ఎన్.