01.*సోమనాధ్ ఆలయం*


1.SOMANADH TEMPLE   




అక్షరవిజన్  న్యూస్ -: (ద్వాదశ జ్యోతిలింగాలు చరిత్ర ప్రత్యేక కథనం)   *సోమనాథ్* మొట్ట మొదటి ఆలయం :-  సృష్టి , స్థితి,లయ కారకుడు పరమేశ్వరుడు...తన లయతో ఈ జగత్తును పాలిస్తున్న బోళా శంకరుడికి భక్తులు తమ ఇచ్చ కొలదీ నిర్మించిన  ఎన్నో ఆలయాలు ఇలలో చారిత్రక ప్రధాన్యతని సంత రించుకున్నాయి. భూ మండలం లో  మానవ మాత్రులే కాదు, దేవతలు పరమ శివుని లింగాకారం లో ప్రతిష్టించి పూజించిన ఆనవాళ్లు అనేకం.. ద్వాదశ జోతిర్లింగాలుగా చెప్పబడే శైవ క్షేత్రాల్లో ఒకటైన  సోమనాదేశ్వర ఆలయ విశేషాలు మీకోసం... గుజరాత్ లోని సౌరాష్ట్ర జిల్లాలో ఉండటం చేతనేమో...సౌరాష్ట్రం చ సోమనాదేశ్వరా అంటూ ఆ శివయ్యను స్తుతిస్తారు... ద్వాపరయుగం లో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు సోమనాదేశ్వరుని దర్శించి దీపం వెలిగించడాని, నేటికీ అఖండ జ్యోతిగా ప్రకాశిస్తోందని చెబుతారు. ఇక ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమ నాథేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురానోక్తి.అసలు చంద్రుడు లింగాన్ని ప్రతిష్టించడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తే, అందుకు మన పూర్వీకులు చెప్పేది,దక్ష ప్రజాపతి పుత్రికలను (అశ్వని, భరణి మొ|| 27 నక్షత్రాలు ) చంద్రునకిచ్చి పెళ్లి చేశాడు. కాని చంద్రుడు ఒక్క రోహిణి యందు మాత్రం ఎక్కువ ప్రేమకలిగి, మిగతా వారిని సరిగ్గా చూడకపోగా వారంతా తమ తండ్రితో చెప్పుకున్నారు.అది సహించని దక్షుడు, చంద్రుని క్షయ వ్యాధిగ్రస్తుడై పోవాలని శపించాడు. గళత్ కుష్టితో బాధ పడుతున్న చంద్రునికి బ్రహ్మదేవుడు భూలోకం లో ఉన్న  ప్రభాస తీర్థాన స్నానమాచరించి, శివరాధన చేయమని సలహా ఇవ్వడం తో చంద్రుడు బ్రహ్మ దేవుని సూచన మేరకు స్నానమాచరించి,  శివలింగాన్ని ప్రతిష్టించి అర్చించి రోగ విముక్తుడైనాడట. సోముడు అనగా చంద్రుడు. లింగరూపుడై ఇక్కడ వెలసిన శివుని ఆరాధించాడు కనుక దీనికి సోమనాధ క్షేత్రం అని పేరు వచ్చింది.

సోమనాథ క్షేత్రం గుజరాత్ రాష్ట్ర వెరావల్‌ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న  హిందూ పుణ్య క్షేత్రము.అరేబియా సముద్రతీరాన ఉండటం తో సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్ళతో నిర్మించ బడింది. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి, ఓంకారం తో అమర్చివుంటుంది. చారిత్రక ఆధారాలద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం 1వ శతాబ్ధానికి చెందినది. ఇది ఒకనాడు శిథిలమైపోగా తిరిగి క్రీస్తు.శ. 649లో అదే శిథిలాల మీద రెండవ ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తరువాత క్రీస్తు. శ. 722లో అరబ్బులు సింధు ప్రాంతంలో బలపడి, భారతదేశం మీద దృష్టి సారించారు. అప్పటి గవర్నరుగా ఉన్న జునాయద్‌ ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలైన మార్వార్‌, బ్రోచ్‌, ఉజ్జయినీ, గుజరాత్‌ ల మీద దండ యాత్ర చేయడం తో రెండవ సారి నిర్మించిన సోమనాథ దేవాలయం ధ్వంసమయ్యింది.ఆ తరువాత చాళుక్యుల కాలంలో దీనిని పునర్నిమించారు. వారి ఏలుబడిలో ప్రభాస నగరం మంచి ఓడరేవు కేంద్రంగా భాసిల్లడంతో, కనౌజ్‌ పాలకులైన ప్రతీహారుల కాలంలో ఈ క్షేత్రం కాశీతో సమానంగా విలసిల్లింది. ఆ కాలంలో ఇక్కడ వున్న అపార ధనరాసులే దండయాత్రలకి కారణాలని చెప్పవచ్చు. ఇదే కోవలో మాండలీకుల పాలనలో ఉండగా 6-1-1026న మహమ్మద్‌ ఘజనీ దండెత్తడం జరిగింది. ఈ పోరులో 50 వేలమంది నేలకూలారు. యుద్ధం మొదలైన ఏడు రోజులకి మాండలీకులు ఇక ఘజనీతో నిలబడలేక రాజ్యాన్ని విడిచి పారిపోయారు. ఈ యుద్ధంలో హమీర్‌గోపాల్‌ అనే రాజకుమారుడు శత్రుసేనలతో తలబడి ఎందరినో మట్టికరిపించాడు. ఈ రాజ్యాన్ని రక్షించడంలో తన ప్రాణాలు కోల్పోయాడు. అందుకు చిహ్నంగా ఇక్కడొక వీరశిలని నిర్మించారు. ఈ యుద్ధంలో విజయం సాధించిన ఘజనీ పోమనాథ్‌ ఆలయ గర్భగుడిలో ప్రవేశించి శివలింగాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం సాధ్యపడక ఆలయ అర్చకుల్ని హింసించి, ఆలయాన్ని ధ్వంసం చేసి పోయాడు. అ సమయంలో పటాన్‌ ప్రభువైన పరమదేవ్‌ తో ఘజిని తలపడి ఓటమి పాలై వెన్ను చూపాడు.  12-13 శతాబ్దం లో నాల్గవ సారి జరిగిన ఆలయ నిర్మాణం కాలగమనంలో  శిథిలావస్థకు చేరుకోగా 1114 సంవత్సరంలో కుమారపాలుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని తన ఏలుబడిలోకి తీసుకుని, ఈ ఆలయాన్నీ, పట్టణాన్నీ పూర్తిగా పునరుద్ధరించాడు. ఆ కాలంలోనే అర్చకులకి వసతి గృహాలు, దేవాలయానికి బంగారు కలశాలు, ముఖమండపంతో శోభిల్లజేసాడు.  1296లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ, తన మామని చంపి, రాజ్యవిస్తీర్ణ చేసుకునే నేపథ్యంలో దండయాత్రలు సాగించాడు. దారిపొడవునా ఎంతో బీభత్సాన్ని సృష్టించుకుంటూ సాగాడు. అలా బయలుదేరినవాడు 1299లో సామనాథ్‌ మీద పడి, ఉలుంఖాన్‌ అనే సేనాని శివలింగాన్ని ముక్కలు ముక్కలుగా బద్దలుకొట్టి, ఆ శకలాల్ని ఖిల్జీకి కానుకగా సమర్పించాడు. ఆ తరువాత 1325-1331 ప్రాంతంలో జునాఘడ్‌ రాజకుమారుడు తిరిగి ఇక్కడ లింగప్రతిష్ఠ చేసాడు. ఆ తరువాతి కాలంలో 1459లో మహమ్మద్‌ బేగ్దా ఇక్కడున్న శివలింగాన్ని తీసివేసి, ఈ మందిరాన్ని మసీదుగా మార్చివేసాడు. ఆ తరువాత అక్భర్‌ పరమతసహనం కలిగివుండటం వల్ల ఇక్కడ ఏ విధమైన గొడవలూ లేకుండా కొంతకాలం ప్రశాంతత నెలకొంది. ఔరంగజేబు కాలంలో 1783లో ఇండోర్‌ మహారాణి అహల్యాభాయి సోమనాథ్‌ మందిరాన్ని పునర్నిర్మించడం జరిగింది. అయితే లింగప్రతిష్ఠ భూగర్భంలో చేసి శత్రువుల బారిన పడకుండా ఉండే ఏర్పాట్లు గావించింది. నాటినుండి తిరిగి కాల ప్రవాహంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ పురాతన క్షేత్రాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 11-5-1951న లింగప్రతిష్ఠ గావించి పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగించారు. ఈ దేవాలయానికి ముందు భాగంలో నవనగర్‌ మహారాణి భర్త దిగ్విజయసింగ్‌ జ్ఞాపకార్థం నిర్మించింది. దీనిని 19-5-1970 సంవత్సరంలో శ్రీ సత్యసాయిబాబా ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు అన్ని వసతులతోటీ, అన్ని దేశాలవారినీ ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక భావతరంగాలను వెదజల్లుతోందిసోమనాధ్ దేవాలయం. ఆరుసార్లు మహమ్మదీయుల దండయాత్రలతో శిథిలమై నేటికి అజరామరం గా విరాజిల్లుతున్న ఈ ఆలయానికి ప్రపంచం నలు మూలాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు సోమనాదేశ్వరుని దర్శించుకునె0దుకు వస్తుఉంటారంటే..పరమేశ్వరుని లీల కాక మరేమిటి.

【న్యూస్ రిపోర్టర్స్ :- కేశానపల్లి కిరణ్ కుమార్ & దేవగుప్తాపు సూర్యనారాయణ మూర్తి】

                                   

                                                                              **రెండవ ఆలయ విశేషాలు తర్వాత ప్రచురణ.**

Comments